తో వస్తుంది 2
“వైషూ నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను. నానమ్మని, శాంతిని విసిగించకుండా మంచమ్మాయిలా ఉండాలి” ఉదయ్, వైషూని వొళ్ళో కూర్చోబెట్టుకొని చెబుతున్నాడు. “ఊహూ! నేను నీతో వస్తాను” ఉదయ్ ని వెళ్లనీకుండా పేచీలు పెడుతోంది వైషూ. “అమ్మో! అక్కడ పెద్ద పెద్ద ఇంజెక్షన్లు ఉంటాయి. వెళ్తే నీకూ పొడిచిపారేస్తారు” ఉదయ్ వాళ్ళమ్మ లలిత భయపెట్టబోయింది. “దాడి” పెద్ద రాగం మొదలెట్టింది వైషూ. “అబ్బబ్బా! సునందా దీని పిచ్చిలతో చచ్చిపోతున్నామనుకో. రోజూ ఇంతే, వాణ్ణి ఓ పట్టాన ఇల్లు కదలనివ్వదు. ఇక ఆ తర్వాత మా ప్రాణాలు తీసిపారేస్తుంది” అంది లలిత. సుందకి అదంతా తెలిసిన విషయమే కనుక విని ఊరుకుంది. ఈ రోజు పొద్దున్న ట్రైన్ దిగినప్పటి నుంచి ఎలా ఈ విషయం కదిపి అందరిని ఒప్పించాలా అనేదే ఆమె ఆలోచన. చివరికి ఉదయ్ సాయంత్రం వచ్చేటప్పుడు ఏవేవో తెస్తానని ప్రామిస్ చేస్తే అప్పుడు వైషూ పర్మిషనిచ్చింది. “అక్కా! బాయ్. ఈవినింగ్ వస్తాను” ఉదయ్, సుందకి చెప్పి వెళ్ళిపోయాడు. లంచ్ అయ్యాక పనిపిల్ల శాంతి, వైషూని పొడుకోబెడుతుంటే, అప్పుడు కాస్త రెలాక్సగా కూర్చున్నారు. “సునంద! ఇంతకీ పెళ్లెలా జరిగింది?” అప్పుడే లలితకి తీరిక దొరికి అడిగింది. మహిమ విషయం కధపటానికి మంచి దారి దొరికిందనుకుంది సునంద “భ్రహ్మాండంగా జరిగింది” అంది. “ప్చ్!” లలిత నిట్టూర్చింది. “ఏమిటో సునందా! అందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి. వీడికా ఘడియలొచ్చే సూచనే లేదు” నిరాశగా చెప్పింది. “అమ్మా! ఉదయ్ ఇంకా ఆ మాటెత్తటంలేదా?” ఏదో ఆలోచిస్తూ అడిగింది. “అంతా నా ఖర్మ” ఆవిడ తలకొట్టుకుంది. “ఈ వయసులో అందరిలా కృష్ణా రామా అనుకుంటూ బతికే యోగం నాకులేదే. ఓరోజు లేస్తే ఓరోజు లెవలెను. ఎప్పుడేలా వుంటానో నాకే తెలీదు. ఎన్నాళ్ళు నేనా పసిదాని బాధ్యతలు మోయగలను? పోనీ దాన్ని వాళ్ళమ్మమ్మా వాళ్ళూ అర్చన పోయాక తీసుకెళ్తామంటే ఇచ్చాడా? ససేమిరా అన్నాడు. ఇవ్వాలంటే నేనున్నాను. తర్వాతయినా దాన్ని చూసుకోటానికో మనిషుండాలిగా. ఆ మాట నీ తమ్ముడి చెవికెంత చెప్పినా ఎక్కనే ఎక్కదు. నేను ఎంత గోలపెట్టినా బెల్లంకొట్టిన రాయిలా ఉలకడు పలకడ. ఇక మీ నాన్న నిమ్మకి నీరెత్తినట్లు చల్లగా కూర్చుంటారు. ఆయనకేం పట్టదు” ఆవిడ తన గోడంతా వెళ్ళబోసుకుంట్టోంది. “అమ్మా నేను చెప్పేది వింటానంటే ఉదయ్ కో మాచ్ తెచ్చాను” అంది సునంద. “మనం తెస్తే సరిపోతుందా? ఇప్పటికి నేనెన్ని తెచ్చాను. వాడు మన మాటేమన్నా వింటాడా?” నిష్ఠూరంగా అంది లలిత. “అవన్నీ వేరు ఇది వేరు. బహుశా దీనికి వాడోప్పుకోవచ్చు” అంది సునంద. లలిత, ఆ పక్కనే కూర్చుని వింటున్న విష్ణుమూర్తిగారు ఇద్దరూ ఒక్కసారి ఆశ్చర్యంగా చూసారు. “మీకు మా పినమావగారు తెలుసుకదా?” వివరాల్లోకొచ్చింది సునంద. “ఆ…ఎప్పుడో మీ పెళ్ళిలో చూశాం. వాళ్ళమ్మాయి పెళ్లెగా ఇప్పుడు జరిగింది” “అవును. ఈ అమ్మాయి చిన్నది. తనకంటే రెండేళ్లు పెద్దది మహిమ గురించి మీకిదివరకోసారి చెప్పాను గుర్తుందా? పెళ్ళయిన ఆర్నెళ్లకే అన్ని పోగొట్టుకొని నాలుగేళ్ళ కొడుకుని తానే చూసుకుంటోందని…” “అయితే?” లలిత అనుమానంగా అడిగింది. “ఆ అమ్మాయయితే ఉదయ్ కి…” అనబోతోంది సునంద. “నీకేమన్నా మతిపోయిందా? పోయిపోయి నాలుగేళ్ళ కొడుకున్న అలాంటమ్మాయిని నా కోడుక్కి చేసుకోమంటావా? నలుగురూ వింటే నవ్వి పోరూ…” వినగానే లలిత కూతురు మీద ఇంతేత్తున లేచింది. “ఏం! నీ కొడుకేమన్నా బాలాకుమారుడా? వాడికి ఓసారి పెళ్లయింది. భార్య పోయింది. మూడేళ్ళ కూతురుంది” సునంద కలాంటి మాటలు వింటే చిర్రెత్తుకొస్తుంది. “వాడికేం మగమహారాజు. పైగా పెద్ద డాక్టరు. కో అంటే కోటిమందొస్తారు” లలిత కాస్త గర్వంగానే చెప్పింది. “వస్తారొస్తారు, కావాలంటే నీ కోడుక్కి పెళ్ళాంగా వస్తారు. కానీ, నీ మనవరాలికి తల్లిగా ఆ కోటిమందిలో ఏ ఒక్కర్తే రాదు” సునంద ఖచ్చితంగా చెప్పేసింది. “నాన్నా! మనం ఆలోచించాల్సింది నలుగురి గురించి కాదు. బయటి వాళ్లకేం పోయింది. వాళ్ళేమైనా ఆరుస్తారా తీరుస్తారా? మనం ఆలోచించాల్సింది వైషూ గురించి, ఉదయ్ గురించి మాత్రమే..” ఇక లలితనొదిలి వాళ్ళ నాన్నవైపు తిరిగింది. “అవునమ్మా! ఆ మాట నేను ఒప్పుకుంటాను” అన్నాడాయన. “నాన్నా! మహిమ నాకు చిన్నపిల్లప్పటి నుంచి తెలుసు. ఆ అమ్మాయి నేచర్, వాళ్ళ ఫ్యామిలీ, ప్రస్తుతం తన సిట్యువేషన్ అవన్నీ చూసే నేనీ ఆలోచనకొచ్చాను. మన వైష్ణవికెలా అమ్మకావాలో, మహీ కోడుక్కి అలాగే నాన్న కావాలి. మహిమైతే వైషూని కన్నతల్లిలా కడుపులో దాచుకుంటుంది. తన కొడుకుతో సమానంగా చూసుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. అందుకే మీరొప్పుకుంటే ఉదయ్ తో నేను మాట్లాడతాను” కూతురు చెప్పింది విన్నాక కాసేపు మౌనంగా.ఉన్నారు. “ఏం నాన్నా! మీకీ ప్రపొజల్ నచ్చలేదా?” అనుమానంగా అడిగింది సునంద. “వినడానికైతే బానే ఉందమ్మా. ఆచరణలో ఎంత వరకు ఫలిస్తుందో?” సందేహంగా లలితని చూస్తూ చెప్పారాయన. ఆవిడొప్పుకుంటుందని ఆయనకి నమ్మకం లేదు. “నాన్నా! మనసుంటే మార్గముంటుంది. నేను ఉదయ్ నెలాగైనా ఒప్పిస్తాను” వాళ్ళ నాన్న నుంచొచ్చిన ఆమాత్రం పాజిటివ్ సైన్ సునందకి ఉత్సాహాన్నిచ్చింది. “ఈ ఇంట్లో నామాట అప్పుడు చెల్లింది గనుకనా ఇప్పుడు చెల్లటానికి” లలితప్పుడే సణగటం మొదలెట్టింది. ఆ రాత్రి ఉదయ్, వైష్ణవిని పొడుకోపెట్టటానికి పైకి తీసుకెళుతుంటే సునందా వెనకాలే వెళ్ళింది. ఉదయ్, వైష్ణవిని గుండెలమీద వేసుకొని జో కొడుతున్నాడు. “నేను పొడుకోపెడతాను ఉదయ్. దాన్ని నాకివ్వు” అడిగింది. “అదంతా ఈజీగా పొడుకోదక్కా తర్వాత ఎదుకడిగానా అనుకుంటావు” ఉదయ్ గాఢంగా వైష్ణవిని హత్తుకొని అపురూపంగా చూసుకుంటుంటే సునంద గుండె కరిగిపోయింది. “నాన్నా! ఎన్నాళ్ళురా ఇలా” జాలిగా అడిగింది. “అక్కా! ప్లీజ్ అలా జాలి చూపించకు. నాకేం నేను బానే వున్నాను” ఉదయ్ తన మీద జాలి చూపిస్తే భరించలేడు. “ఉదయ్! మొన్న పెళ్ళిలో అచ్చం నీలాగే ఫీలయ్యే అమ్మాయిని చూశాన్రా. మా పినమావగారమ్మాయి. పేరు మహిమ” సునంద మెల్లిగా మొదలెట్టింది. అప్పటికే ఉదయ్ కేదో అనుమానం వచ్చి నుదురు చిట్లించాడు. “అక్కా! నువ్వే టాపిక్ మాట్లాడుతున్నావ్?” అసహనంగా అడిగాడు. “ఉదయ్! నాకన్నా ఏదేనిమిదేళ్లు చిన్నవాడివి నువ్వు. నా పిల్లలెంతో నువ్వు నాకంతేరా. నాకు నీ గురించి, వైషూ గురించి బెంగా, చింతా ఉండవా చెప్పు? మొన్న పెళ్ళిలో మహీని చూసాక ఆ అమ్మాయి పట్ల కూడా నేనీలాగే ఫీలయ్యాను. ఉదయ్, మహిమ గురించి చెప్తే నువ్వు నమ్మవు. జస్ట్ ఇరవైరెండు నిండి ఇరవైమూడు నడుస్తోంది. చాలామంది అమ్మాయిలకి ఆ వయసులో ఇంకా పెళ్లి కాదు. కానీ, మహిమకి పెళ్ళయి నాలుగేళ్ళ కొడుకున్నాడు. పెళ్లయిన ఆరునెలలకే హుస్బెండ్ని పోగొట్టుకున్న ఆమె కండిషన్ నాకన్నా నువ్వే ఎక్కువ ఇమాజిన్ చెయ్యగలవు” మహిమ గురించి చెప్పటం మొదలుపెట్టింది సునంద. “అక్కా! నీ ఉద్దేశం నాకర్ధమైంది కానీ నాకు మాత్రం ఆ ఆలోచనే లేదు. సారి” ఉదయ్ మధ్యలోనే అడ్డుపడ్డాడు. “నీకా ఆలోచన ఎందుకులోదో నాకు తెలియదనుకున్నావా? వైషూకి సవతితల్లి చేతిలో పెట్టటానికి భయం, బెంగా, బాధ. ఏరా మాకు మాత్రం ఆ భయం లేదనుకున్నావా? అందుకే మహిమైతే…” “అక్కా! డోంట్ వర్రీ. వైషూకి చూసుకోటానికి అమ్మ ఉంది, నేనున్నాను. నో ప్రాబ్లెమ్” ఉదయ్ తేలిగ్గా చెప్పేసాడు. “అవును. అమ్మ ఉంది. ఎన్నాళ్లుండగలదు. ఉదయ్, వైషూ ఆడపిల్లరా. దానికి అమ్మ అవసరం ఎంతుంటుందో నీకూ బాగా తెలుసు. నువ్వున్నాసరే దానికో అమ్మ కావాలి. ఒక ఫ్యామిలీ కావాలి. అలాగే అక్కడ మహీ కొడుక్కైన అంతే. వాడు కళ్ళు తెరిచి సరికే వాళ్ళ నాన్న కన్నుమూశాడు. అందరికి ఉన్న నాన్న తనకొక్కడికే ఎందుకు లేడో ఆ పసిమనసుకు.